అనుచరులు

latex ద్వారా థీమ్‌లు. Blogger ఆధారితం.

కూడలి

Browsing "Older Posts"

అందమైన అమ్మ- కథ

20, జనవరి 2011, గురువారం / No Comments
కాంక్రీట్ జంగిల్ లో సూరీడు ఆకాశహార్మ్యాల మధ్య ఉదయించాడు. నిన్నటి వరకు సంక్రాంతి పేరుతో ఫ్రెష్ గా కనిపించిన హైదరాబాద్ మహానగరం మళ్ళీ రష్ గా తయారయ్యింది. ఎటుచూసినా చీమలదండుల్లాంటి వాహనాలు.     దిక్కులు పిక్కటిల్లేలా అరుస్తూ నలువైపులాచక్రాల పరుగులే. వీటన్నిటికీ నిత్య ప్రేక్షకపాత్రలో రోడ్డు మధ్యలో ట్రాఫిక్ సిగ్నల్స్.  కాదేదీ  కడుపు నింపటానికి అనర్హం అన్నట్టుగా ఆట్రాఫిక్ సిగ్నల్స్ ని నమ్ముకుని బిక్షాటన చేసి కడుపు నింపుకునేవాళ్ళు, కాలం వెళ్ళదీసేవాళ్ళు ఎంతోమంది.                                                                                              
   రెడ్ లైట్ పడింది..! అనకొండలా కదులుతున్న వాహనాలన్నీ ఒక్కసారిగా ఆగిపోయాయి. అప్పటివరకూ ఫుట్ పాత్ పై ఆడుకుంటున్న పిల్లలు బిలబిలమంటూ ఆగివున్న వెహికల్స్ దగ్గరకు పరుగుతీసారు.అందరిదీ ఒకేతీరు.. జాలీగా ముఖంపెట్టి చేయిచాచడం! అందరిదీ ఒకేమాట.."అమ్మా..అయ్యా.." అంటూ!వారిని చూడగానే కాస్ట్లీ కారు విండోలు క్లోజ్ అయిపోతాయి. హెల్మెట్ ఫేసులు ఎటో చూస్తుంటాయి.ఇచ్చేవారు ఇస్తున్నారు..తిట్టేవారు తిడుతున్నారు. కొంచెంసేపు అవ్వగానే మళ్ళీ హారన్ల మోత. గ్రీన్ లైట్ పడిందిమరి.

   సిగ్నల్స్ దగ్గర రెడ్ లైట్ పడగానే వారికి ఎంతో ఆనందం. వాహనాలన్నీ ఒక్కసారిగా ఆగిపోతాయి. అప్పుడు వారికి సాయం చేసే మహరాజులు దొరుకుతారు. గ్రీన్ లైట్ అంటే వారికి కోపం,అది పడగానే ఆ మహరాజులు చేజారిపోతారు కాబట్టి.
   ఇంతటి గందరగోళంలోనూ తనకేమీ సంబంధం లేనట్టుగా దూరంగా గోడపై దిగులుగా కూర్చుని ఆలోచిస్తున్నాడు ఎనిమిదేళ్ళ కుర్రాడు 'చెంచు'. తను కూడా ట్రాఫిక్ సిగ్నల్ కుటుంబీకుడే. తను కూడా రెడ్ లైట్ ను మెచ్చుకుంటూ గ్రీన్ లైట్ ను తిట్టుకుంటూ చిల్లరకోసం చేయి చాచేవాడే..! కానీ ఈరోజు అవేమీ పట్టనట్టుగా కూర్చున్నాడు. కొత్తగా దేనికోసమో ఎదురుచూస్తున్నట్టు తదేకంగా రోడ్డుపై వచ్చిపోయే కార్లను చూస్తున్నాడు. రోడ్డు ఖాళీ అయినపుడు మాత్రం దూరంగా కనిపించే ఎండమావుల్ని చూస్తూ తన పసి హృదయంతో పోటీపడి కలవరపడుతున్నాడు. ఇదంతా నిన్నటి సంక్రాంతి రోజు రేపిన చిచ్చు. అదెలా అంటే..?!
    చెంచు ఒక అనాధ. అలా అంటే వాడు అస్సలు ఒప్పుకోడు..'మా అమ్మ నన్ను కని చెత్త కుప్పలో పడేసి వుండొచ్చు.. కానీ నన్ను చేరదీసిన అవ్వ నాతో వుంది. ఆ చెత్తకుప్ప కూడా ఇంకా నా పక్కనే వుంటుంది. ఇల్లు వదిలి రోడెక్కినవారందరూ నా చుట్టూ తిరుగుతూనే వుంటున్నారు..' అంటూ ఏదేదో చెప్తాడు రచయిత ఊహల్లోని క్యారెక్టర్ లా. అలాంటి 'చెంచు' సంక్రాంతి పండుగరోజు తన అవ్వ నడిగి ఒక కొత్తసినిమా చూడటానికి వెళ్ళాడు.
   దియేటర్ లో కూర్చున్నాడు...స్క్రీన్ కి ముందు వరుసలో...మనసంతా ఒకటే ఆనందం.మెడ ఎత్తి కళ్ళు పెద్దవి చేసి చూసేంత ఆనందం. ఆ ఆనందాన్ని చంపుకోవడం ఇష్టంలేక బొత్తాములు తెగి జారిపోతున్న చొక్కాను ఎగరేసి ఈల వేస్తున్నట్టుగా ఓ వెర్రి కేక వేసాడు. దియేటర్ లో బెల్ మోగింది..! సినిమా బిగినయ్యింది...!
'పండగ పూట కూడా..' అన్నట్టుగా చెంచు కి ఆ సినిమాలో కూడా తను రోజూ చూసే మురికి వాతావరణమే కనిపించింది..అదొక స్లమ్ ఏరియా..! స్క్రీన్ పై కనిపిస్తున్నవారందరూ నిరుపేదలు, ముష్టివాళ్ళు. ఇదంతా నేను ప్రతిరోజూ చూసేదే ఇందులో కొత్తదనం ఏముంది అనుకున్నాడు. వెంటనే బయటకు వచ్చెయ్యాలని అనిపించింది. అప్పుడు కనిపించింది ఒక కొత్త దృశ్యం..                                                                                                           
    ఆ మురికి వాడలోకి ఒక ఖరీదైన కారు సుతి మెత్తగా వచ్చి ఆగింది. అంతకంటే మరో అధ్భుతం.. దేవకన్యలాంటి ఒక స్త్రీ కారు దిగింది. ఆమెను చూస్తుంటే పేదరికానికి మరింత కన్నుకుట్టేలా వుంది. ఆమె సరాసరి బరకంతో కుట్టుకుని వున్న ఒక గుడిసె దగ్గరకు వెళ్ళింది.ఇంతలో ఒక ముసలావిడ ఐదేళ్ళ కుర్రడితో బయటకొచ్చింది. ఆపిల్లాడు చూట్టానికి చాలా వికారంగా వున్నాడు.వెంటనే ఆమె ఆపిల్లాడ్ని దగ్గరకు తీసుకుని గుండెలకు హత్తుకుని ఏడ్చింది. వాడి ఒళ్ళంతా ముద్దులు పెట్టుకుంది.

    చెంచు మెదడులో ఒక్కసారిగా ఏవేవో కొత్త ఆలోచనలు, అలజడులు. రెప్పవేయకుండా అలానే చూస్తున్నాడు. దియేటర్లో డైలాగ్స్ వినిపిస్తున్నాయి.." ఆవేశంలో తప్పు నేను చేసాను, అనాదను చేసి శిక్ష నీకు వేసాను. నన్ను క్షమించు నాన్నా.." ఆతల్లి పిల్లాడిని పట్టుకుని ఏడుస్తుంది. ఆ తర్వాత ఏదేదో జరుగుతుంది. అవన్నీ చెంచు మెదడులోకి ఎక్కడంలేదు. చివరిగా ఆతల్లి అక్కడున్నవారందరికీ ఏడుస్తూ చేతులెత్తి దణ్ణం పెడుతూ ఆపిల్లాడిని తన కారులో కూర్చోబెట్టుకుని అక్కడ్నించి బయల్దేరింది. చిన్నప్పుడే తనని కని పారేసిన తల్లి తిరిగి తన వద్దకు వచ్చినందుకో లేక తనను చూడగానే మూసుకుపోయే అద్దాల కారులో ఇప్పుడు తను కూర్చున్నందుకో తెలియదుగాని ఆ పిల్లడు మాత్రం ఇప్పటికి నవ్వుతూ చేయి ఊపుతున్నాడు.

    ఆ తర్వాత ఏంజరిగిందో తెలియదు. చెంచుమాత్రం వెంటనే దియేటర్ లో నుంచి బయటకు వచ్చేసాడు. ఆలోచనలతోనే సిగ్నల్స్ వద్దకు వచ్చాడు. ఇప్పుడక్కడ వున్నవేమీ అతనికి కనిపించడంలేడు, నచ్చడంలేదు. అందుకే కొంచెం దూరంగా రోడ్డుపక్కనే చెత్త కుండీ పక్కనే వున్న పిట్టగోడపై కూర్చున్నాడు. తను చూసిన సినిమాలోని కధను తనకు ఆపాదించుకున్నాడు. "నన్ను కూడా మా అమ్మ కని వదిలేసిందని, అనాదను చేసిందని అందరూ అంటారుకదా..! ఇప్పుడు ఆ సినిమాలో వచ్చినట్టు నన్ను వెతుక్కుంటూ అంత అందమైన అమ్మ నాదగ్గరకు వస్తుందికదా..

    అదే సిగ్నల్..అదే ట్రాఫిక్..! రెడ్ లైట్ మారలేదు, గ్రీన్ లైట్ మారలేదు. కానీ చెంచు మనసు ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. అతనికిపుడు ఒకటే ఆశ, ఆలోచన.ఆ చెత్తకుండీ పక్కన, ఆపిట్టగోడ మీద కూర్చుని వచ్చిపోయే కార్లను ఎంతో ఆతృతగా చూస్తున్నాడు. ఎప్పుడైనా ఒక కారు పొరపాటునా తనకెదురుగా ఆగితే చాలు ఎంతో ఆశగా లేచి చూసేవాడు. అదివెళ్ళగానే అంతే నిరాశగా గోడపైకి ఎక్కి కూర్చునేవాడు. ఉబికి వస్తున్న కన్నీళ్ళను బలవంతంగా ఆపుకునేవాడు. సంవత్సరాలు గడిచిపోయాయి.

    "సంక్రాంతి రావడం,పోవడం ఆగలేదు.. నా ఎదురు చూపులూ ఆగలేదు.. అందుకే చివరకు నేనే ఒక నిర్ణయానికి వచ్చేశాను. ఎవరన్నారు నాకు అమ్మలేదని.. నాకళ్ళముందు ఇంతమంది కనబడుతుంటే..! అందమైన అమ్మకోసం చూసి చూసి అందరిలోనూ అమ్మను చూడటం మొదలు పెట్టాను. రెడ్ లైట్ ను మెచ్చుకుంటూ, గ్రీన్ లైట్ ను తిట్టుకుంటూ .. ఆ సిగ్నల్ దగ్గర అందరినీ యాచిస్తూ.." - చెంచు 

వివిధ దేశాల రక్షక నారిమణులు

9, జనవరి 2011, ఆదివారం / No Comments

క్యార్ క్యార్

7, జనవరి 2011, శుక్రవారం / No Comments
ఇవాళ అనుకోకుండా ఒక ఫ్రెండ్ బోంబే నుండి చాలా రోజుల తర్వాత ఫోన్ లో కలిసాడు. పెళ్లి గురించి అడిగితే 'సహజీవనం' సంగతి తెలిసింది. ఈ సందర్భంలో ఒక చిన్న ఫన్ కౌంటర్ ...
"గురూ...గురూ..."
"ఏంట్రా..?ఏంటా ఆత్రం?"
"ఇదెక్కడి అన్యాయం గురూ..నాకు చెప్పకుండా వెళ్ళిచేసుకుంటావా?"
"పెళ్ళా..నేనా..ఛఛ.."
"ఛఛ ఏంటి..నిజమే కదా"
"ఎహే..ఇప్పట్లో పెళ్ళి ఆలోచనే పెట్టుకోకూడదని నేనెప్పుడో ఫిక్సైపోతేని"
"అదేంటి..మరి ఆ అమ్మాయి,నుĸ 5;్వు కలిసి ఒకే ఇంట్లో వుంటున్నారట"
"ఓ అదా..దాన్ని పెళ్ళి అనరు..సహజీవ నం అంటారు"
"అంటే పెళ్ళికి ముందే ఉంచుకోవడమా గురూ?!"
"ఛఛ..అదేంమాటరా..తప్పు కళ్ళుపోతాయ్"
"నా కళ్ళు పోవడం కాదు నీ పరువు పోతుంది"
"ఆ పోతేపోనీరా! ఈ వంకతో రుచులు,అభిరుచులంటూ కొన్నాళ్ళపాటు అమ్మాయిలతో హ్యాపీగా గడిపెయ్యొచ్చు"
"ఈలోగా జరక్కూడనిది ఏదైనా జరిగితే?"
"అంటే?"
"అదే గురూ! కరెంటు పోవడమో...ఆపై కాలు జారడమో లాంటివి జరిగితే?"
"ఆ..అప్పుడు చూస్కోవచ్చులే.దానికెలాంటి శిక్షలు,సెక్షన్లు కోర్టు చెప్పలేదుకదా"
"అలాగని ఈ సహజీవనం పేరు చెప్పి ఎవరికివాళ్ళు పెళ్ళికి ముందు మీలా రెచ్చిపోతే"
"అప్పుడు ఇండియాలో కూడా అమెరికాతో సమానంగా ఒక డైలాగ్ వినబడుతుందిరా.."
"ఏంటి గురూ అది?"
"ఏమండీ..!మీ పిల్లలు మా పిల్లలూ కలసి మన పిల్లల్ని కొడుతున్నారు' అని"
"ఆ!!??..అంటే"
"ఏముంది..ఆయనకు పెళ్ళికిముందేక్యార్..క్యార్, ఆవిడకూ పెళ్ళికి ముందే క్యార్..క్యార్, వీళ్ళిద్దరికీ పెళ్ళాయ్యాకమళ్ళీ క్యార్..క్యార్..అంతే"
"క్యార్...!!???"

తల్లి ప్రాంతాలపైన.. బిడ్డ మతాల పైన!

1, జనవరి 2011, శనివారం / No Comments
బ్లాగరులు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు . అంతర్జాల మిత్రులను  నిరంతరం ఎన్నెనో కబుర్లతో పలకరించాలని ప్రారంబించిన నా 'వెన్నెల గోదారి' బ్లాగును కొన్ని అనివార్య కారణాల వలన కొద్దిరోజులుగా పట్టించుకోలేకపోయాను. కనీసం జనవరి మొదటిరోజు శుభాకాంక్షలు కూడా చెప్పలేకపోయాను. సరే..ఈలోపుగా ప్రతి రోజు ఎన్నెన్నో సంఘటనలు. ఈ మధ్య మనదేశ పాలనా యంత్రాంగంలో చూస్తున్న కొన్ని విషయాల ఆధారంగా ఒక చిన్న కథ స్పురించింది. 
"అనగనగ ఒక రాకుమారి. ఆ రాకుమారిని మరో దేశ రాకుమారుడులాంటి వ్యక్తి ప్రేమించాడు. అనంతరం  అతను ఒక రాజ్యానికి నాయకుడయ్యాడు. దురద్రుష్టవశాత్తు అతను ముష్కర మూకల దాడిలో మరణించాడు. అప్పుడు ఆ రాకుమారి ఆ రాజ్య బాధ్యతలు చేపట్టాలని నిర్ణయించుకుంది. త్యాగ మూర్తి పేరుతో అందరి మనసులో చోటు సంపాదించుకుంది. ఇంతవరకు చాలా బాగుంది. ఆ తర్వాత ఏమయ్యిందో తెలీదు. రోజులు గడుస్తుండగా ఏవో తెలీను మార్పులు ఆ రాజ్యంలో. ఆ రాజ్య ప్రజలకు పూర్వపు అనుభవంలో వున్న 'విభజించు పాలించు' అనే సూత్రం మళ్లీ కళ్ళ ముందు కదులుతున్న చాయలు. అవినీతి, అధికార దాహం, ఆందోళనల పేరుతో ప్రజల మధ్య , ప్రాంతాల మధ్య విభజన రేఖలు ప్రభలుతున్న అనుభవాలు. మరో పక్క ఆమె పుత్రరత్నం నుండి మరో రకమైన విభజన వాక్కులు.   'భిన్నత్వంలో ఏకత్వం ' అనే దానికి అచ్చమైన ఉదాహరణగా నిలిచిన ఆ రాజ్యంలో మతం ఆధారంగా జనాల మనసులో విభజనలు తొంగి చూసే  మాటలు. అదీ మరో రాజ్యానికి చెందిన వారితో.  కోణాలు ఏవైనప్పటికీ మరొక్క సారి 'విభజించు పాలించు' అనే సూత్రం ఆ రాజ్యాన్ని భవిష్యత్తులో చిందరవందర చేయనుందా? అనేది క్లైమాక్స్. -  మాంచి ప్రొడ్యూసర్ దొరికితే ఈ కథతో సినిమా తీయాలని మా ఫ్రెండ్ కలలు కంటున్నాడు. మీ అభిప్రాయం చెప్పి ఆ ప్రొడ్యూసర్ ని రక్షించండి.