నాకు కొన్ని తిట్లు కావాలి నాన్నా!
30, అక్టోబర్ 2010, శనివారం
/
No Comments
ఉదయం ఐదు గంటల సమయం. టాం & జేర్రీలు తన చుట్టూ తిరుగుతూ పోట్లాడుకుంటున్నట్టుగా కలగంటున్నాడు టింకు! వాళ్ళ నాన్న ఆదుర్దాగా లేపుతున్నట్టుగా అనిపించి కళ్ళు నులుముకుంటూ లేచాడు. ఎదురుగా వాళ్ళ నాన్న మాంచి కద్దరు డ్రెస్ వేసుకుని రెడీ అయ్యి వున్నాడు. 'ఏంటి నాన్నా అప్పుడే లేపేసావు?' అని అడిగాడు.
'నాకు కొన్ని తిట్లు కావాలి రా'
'తిట్లా?'
'అవును'
'అదేంటి నాన్నా సిగ్గులేకుండా అలా అడిగావు?'
'అంత డైరెక్ట్ గా అడిగితే ఎలా చెప్పనురా .. కావాలి చెప్పు?'
'ఎందుకో చెప్పు నాన్నా?' రెట్టించాడు టింకూ.
'ఏం లేదు రా.. అన్ని టివీ చర్చా కార్యక్రమాలలో ఇప్పటిదాకా మాట్లాడి మాట్లాడి..'
'మాట్లాడా? పోట్లాడా నాన్నా?'
'నీకు తెలిసీ ఎందుకురా అడుగుతావు.. పోట్లాడే! నా దగ్గరున్న బూతులన్నీ అయిపోయాయి. మిగిలినవాళ్ళందరూ వరసబెట్టి నన్ను తిడుతుంటే నాదగ్గర మాటలు లేక..'
'మాటలు కాదు నాన్నా.. బూతులు'
'అవే.. అవిలేకే నా మొఖం కెమేరాకు చూపించలేకపోతున్నానురా. నువ్వు గాని స్కూల్లో మీ ఫ్రెండ్స్ తిట్టుకునే నాలుగు కొత్త తిట్లు చెప్పావనుకో ఈ రోజు చర్చా కార్యాక్రమంలో నా తడాఖా చూపిస్తాను'
'అమ్మ దగ్గర మంచి తిట్లు వుంటాయి నాన్నా. రోజూ నిన్ను ఇంట్లోను, టివీలోను చూస్తూ చాలా తిడుతూ వుంటుంది.'
'మ్.... మీ అమ్మ తిట్టేవన్నీ నావే రా .. నువ్వు టైం వేస్ట్ చెయ్యకు. అవతల లైవ్ కి టైం అవుతుంది.. తొందరగా చెప్పు.'
'మ్..కపి..కచ్చ...కనా..క...క...క...!'
'కపి..కచ్చ...కనా..క...క...క....! కొత్త తిట్టా?'
'అవును నాన్నా '
'అర్ధం తెలియకపోయినా చాలా కొత్తగా వుందిరా ..మ్మ్..చాలా థాంక్స్..ఇవాళ్ళ లైవ్ లో దుమ్ము దులిపేస్తాను ' అంటూ తండ్రి వెళ్ళిపోయాడు.
తండ్రి వెళ్ళగానే మళ్ళీ నిద్రలోకి జారుకున్నాడు టింకూ ! టాం & జేర్రీలు మళ్ళీ కలలోకి వచ్చి..
'టింకూ మా ఇద్దరికీ తిట్టుకోవడానికి బూతులు లేక కొట్టుకుంటున్నామ్. మాక్కూడా కొన్ని నేర్పోచ్చుగా ' అన్నాయి.
'అది అందరికీ తెలిసినదే.. కాకపోతే 'క' భాషలో చెప్పాను. అయినా మీకు తిట్లు కావాలంటే న్యూస్ చానల్స్ లో వచ్చే చర్చాకార్యక్రమాలు చూడండి. డోంట్ డిస్టర్బ్ మి! అని కలలు కనడం మానేసి పడుకున్నాడు టింకూ !

